E-PAPER

+91 92480 61999

సీఎం రేవంత్‌తో రాజకీయ నేతల భేటీ..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి తాజా నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం సచివాలయంలో రాజీకయ పార్టీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర గీతం, చిహ్నంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

 

ఈ సమావేశానికి విజయశాంతిని కూడా ఆహ్వానించారు. కానీ, విజయశాంతి ఈ భేటీకి గైర్హాజరవుతున్నారు. సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు విజయశాంతి స్పష్టం చేశారు. ముందే సినిమా సెడ్యూల్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌లను దృష్టిలో ఉంచుకుని షుటింగ్‌కి వెళ్తున్నట్లు వివరించారు.

 

గతంలో సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. మొదట్లో పరోక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి 1998లో బీజేపీలో చేరారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో… విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు.

 

2009 వరకు బీజేపీలో ఉన్న విజయశాంతి.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ‘తల్లీ తెలంగాణ’ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అయితే, కొంతకాలానికే కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్‌ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేసీఆర్‌తో విభేదాల రావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.

 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్‌, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పనిచేశారు. ఇక, 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున విస్తృత ప్రచారం కూడా చేశారు.

 

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆమె పెద్దగా కనిపించలేదు. ఇటీవల ఓ సందర్బంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అందులో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !