E-PAPER

+91 92480 61999

వైసీపీకి రావెల రాజీనామా,త్వరలో మరికొందరు..?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడనుంది. దీనికి సంబంధించి న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో తన కేబినెట్‌లోకి ఏపీ బీజేపీ నుంచి ఎవరికి తీసుకోవాలనే దానిపై చంద్రబాబు చర్చించనున్నారు. దాని తర్వాత బాబు కేబినెట్ ఓ కొలిక్కిరానుంది.

 

ఇదిలావుండగా వైసీపీ వ్యవహారశైలిపై ఆ పార్టీలోని చాలామంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము టీడీపీని వదిలి ఎందుకు ఈ పార్టీలోకి వచ్చామని తమ తమ మిత్రులతో చెప్పి బాధపడుతున్నారు. మరి కొందరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు రావెల కిషోర్‌బాబు.

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతో సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరానన్నారు రావెల. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు భావించడం, కూటమికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారన్నారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజా సేన చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మంత్రిగా పని చేసి పేద ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు.

 

ఇదిలావుండగా ఒంగోలు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఎన్నికలకు ముందే ఆయన జనసేనలోకి చేరుతారని వార్తలు వచ్చాయి. ఈలోగా వైసీపీ హైకమాండ్ ఆయన్ని కన్వీన్స్ చేయడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఎన్నికల విజయం సాధించిన పవన్ కల్యాణ్ ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అల్లర్లు జరగకుండా పవన్ ఇచ్చిన పిలుపును ప్రశ్నింసించారు. దీంతో బాలినేని రేపో మాపో జనసేన పార్టీలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.

 

మరో 20 మంది నేతలు వైసీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. వారిలో పది మంది రకరకాల వ్యాపారాలున్నవారు ఉన్నారట. మరికొందరు ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరంతా ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలామంది బీజేపీ, జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈసారి ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో టీడీపీకి చెందిన చాలామంది నేతలకు టికెట్లు లభించలేదు. చివరకు జనసేన, బీజేపీలోకి వెళ్లి అక్కడి నుంచి బరిలోకి దిగారు. వారంతా గెలుపొందారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినవారంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి వచ్చినవారు దాదాపుగా విజయం సాధించారు. మరి రానున్నరోజుల్లో వైసీపీని ఎంతమంది వీడుతారనేది ఆసక్తికరంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !