E-PAPER

+91 92480 61999

ఒకే వేదికపై సోనియా గాంధీ.. కేసీఆర్..!

జూన్ 2వ తేదీన దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.

 

ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశ రాజధానిలో ఆమెతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు.

 

తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యలో ఈ వేడుకలు జరగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో సోనియా గాంధీ ఈ దశాబ్ది ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు చెబుతున్నారు.

 

అదే సమయంలో- భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కూ ఆహ్వానం అందింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు ఈ సాయంత్రం కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు.

 

కేసీఆర్‌ను కలిసిన అనంతరం వేణుగోపాల్ రావు విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్‌ను కలిశామని, ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రాన్ని అందించామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాసిన లేఖనూ కేసీఆర్‌కు ఇచ్చామని పేర్కొన్నారు.

 

2వ తేదీన ఉదయం సికింద్రాబాద పరేడ్ గ్రౌండ్స్, సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయబోయే రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశామని హర్కర అన్నారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.

 

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ ఈ దశాబ్ది ఉత్సవాల కోసం ఆహ్వానిస్తోన్నామని హర్కర వేణుగోపాల్ చెప్పారు. ఈ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. దశాబ్ది వేడుకలను కనివినీ ఎరుగని విధంగా నిర్వహించబోతోన్నామని పేర్కొన్నారు.

 

ప్రభుత్వ ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ వేడుకలకు హాజరవుతానని తెలిపారు. కాగా- కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరైతే సోనియా గాంధీతో కలిసి తొలిసారిగా వేదికను పంచుకున్నట్టవుతుంది. గతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత ఆయన తన కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి సోనియాను కలుసుకున్న విషయం తెలిసిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !