E-PAPER

+91 92480 61999

రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ..

లంచం తీసుకుంటూ పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB)కి చిక్కారు. భరత్ రెడ్డి అనే వ్యక్తి భూ వివాదం కేసును మూసివేసేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసులు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్‌స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు గంటలకుపైగా ఏసీబీ సోదాలు నిర్వహించారు. భూ వివాదం పరిష్కారం కోసం ఈ పోలీసు అధికారులు.. మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది.

 

భరత్ రెడ్డి ఆఫీసులో మధ్యవర్తి ఉపేందర్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్‌స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలిపారు.

 

ఇది ఇలావుండగా, హైదరాబాద్‌ నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో గురువారం రాత్రి నలుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు కార్తీక్, నికేశ్‌తో పాటు లంచం తీసుకుంటుండగా మరో కీలక అధికారిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

 

నీటిపారుదల శాఖలో క్యాడ్ అనేది మానిటరింగ్ సెల్‌గా పనిచేస్తుంది. ఈ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ ముగ్గురు ఉద్యోగులు ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక కల్వర్టు విషయంలో బిల్లులకు సంబంధించిన ఫైలుపై సంతకం కోసం వీటిని డిమాండ్ చేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 

బాధితుడు గతంలోనే లక్ష రూపాయలు చెల్లించాడు. మళ్లీ ఇప్పుడు మరో లక్షన్నర డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇరిగేషన్‌ అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ.. ఈఈతో పాటు ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను పట్టుకుంది. ఈ వ్యవహారంతో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉంది? తీసుకున్న డబ్బులు ఎవరెవరికి చేరుతున్నాయనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !