E-PAPER

+91 92480 61999

మళ్లీ మన ప్రభుత్వమే- వైఎస్ జగన్ ట్వీట్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు గెలుపుపై ఎంతో ధీమాగా కనిపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం వైఎస్ జగన్ తనకు రాజకీయంగా వ్యూహాలు అందించిన ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ఈసారి ఎన్నికలపై తన జోస్యం చెప్పేశారు. ఈసారి గతంలో గెలిచిన 151 సీట్లకు పైగానే సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే క్షేత్రస్ధాయిలో వైసీపీ క్యాడర్, నేతలు మాత్రం ఈసారి ఆ స్ధాయిలో సీట్లు రాకపోవచ్చని అంచనా వేస్తోంది.

 

ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. గతంలో 2019లో గెలిచి ఇదే రోజున ప్రమాణస్వీకారం చేసిన జగన్.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ట్వీట్ చేశారు. అందులో అప్పట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోను పెట్టి ఈసారి ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో అదే మరోసారి జరగబోతోందని సీఎం జగన్ హింట్ ఇచ్చేశారు.

“దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్,భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకుంటారు. ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !