E-PAPER

+91 92480 61999

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై ఈసీ కీలక ప్రకటన..!

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై నెలకొన్న సందిగ్ధతపై స్పష్టత ఇచ్చారు.

 

ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే లెక్కిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలనే నిబంధన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్లో ఉందని గుర్తు చేశారు.

 

1964లో ప్రవేశపెట్టిన 54ఏ రూల్ ప్రకారం.. తొలుత పోస్టల్ బ్యాలెట్లనే లెక్కించాల్సి ఉంటుందని వివరించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే కౌంటింగ్ కేంద్రాలన్నింట్లోనూ వీటి ద్వారానే లెక్కింపును ప్రారంభించాలని 54ఏ సూచిస్తోందని చెప్పారు. అవి పూర్తి కాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరవడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

 

అప్పట్లో పీడబ్ల్యూడీ ఓటర్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండేదని, సీనియర్ సిటీజన్లు ఈ వెసలుబాటును వినియోగించుకునే వాళ్లు కాదని చెప్పారు. ఆ తరువాత క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వచ్చిందని, ఇప్పుడు జర్నలిస్టులకు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించామని రాజీవ్ కుమార్ చెప్పారు.

 

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన అరగంట తరువాత ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని ఆయన అన్నారు. 2019 నాటి సార్వత్రికం మొదలుకుని ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తూ వస్తోన్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆదివారం నాడు ముగిసిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూడా దీన్నే పాటించామని చెప్పారు.

 

తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం ఈవీఎంలు, ఆ తరువాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన అయిదు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వాటి లెక్కింపు తొందరగా ముగుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !