E-PAPER

+91 92480 61999

పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు ప్రత్యేక సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేక అయిన నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. బుధవారం జరగనున్న ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.

 

కాగా, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ భార్యకొణిదెల అన్నా లెజినోవా, కొణిదెల అకిరా నందన్‌తో కలిసి చంద్రబాబు నాయుడిని సత్కరించారు. ఇక, పవన్ కొడుకు అకిరా నందన్.. చంద్రబాబు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అకిరాకు టీడీపీ అధినేత ఆశీస్సులు అందించారు.

 

ఎన్డీఏ కూటమి విజయ దుందుభి

 

ఏపీలో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించింది. ఏపీలో మొత్తం 175 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. ఇందులో టీడీపీకి 135, జనసేన పార్టీకి 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఇక, మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 21 సీట్లను గెలుచుకుంది. ఇక, వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు దక్కాయి. కాగా, జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలకంగా కానున్నారు.

 

మోడీకి చంద్రబాబు, పవన్ కృతజ్ఞతలు

 

ఏపీలో ఎన్డీఏ అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ భవిష్యత్తుపై నిబద్దతతో ఉన్న మోడీ, అమిత్ షా, నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. అటు దేశంలో, ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించేందుకు సహకారం అందించిన ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

 

ఈ గెలుపు చరిత్రాత్మకం అంటూ నాగబాబు హర్షం

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించడంపై జనసేన పార్టీ నేత నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ భారీ విజయం నమోదు చేశారు. 70 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

‘సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు. భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు. నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు. కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు’ అని నాగబాబు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !