E-PAPER

+91 92480 61999

ఓడిపోయా- పేరుమార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటన..!

పిఠాపురంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న వైఎస్ జగన్ పట్టుదలలో భాగంగా తెరపైకి వచ్చిన కాపు నేత ముద్రగడ పద్మనాభానికి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో పవన్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేసిన ముద్రగడ తానే దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆయన గత సవాల్ కు కట్టుబడి ఉన్నట్లు ఇవాళ ప్రకటించారు.

 

పిఠాపురంలో పోటీకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ప్రకటించగానే అక్కడ ఆయన ప్రత్యర్ధిగా నిలబెట్టిన వంగా గీతను గెలిపించే బాధ్యతను వైసీపీ ముద్రగడకు అప్పగించింది. అయితే పిఠాపురంలో తన సామాజిక వర్గం అంతా పవన్ కు అండగా ఉందనే చిన్న విషయాన్ని విస్మరించిన ముద్రగడ.. జగన్ ఆడమన్నట్లే ఆడారు. అదే క్రమంలో పవన్ ఓడిపోతున్నారని, ఆయన్ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ కూడా చేశారు.

 

ముద్రగడ సవాల్ పై అప్పట్లోనే జనసైనికులు నవ్వుకున్నారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల్లో ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించడమే కాకుండా జనసేనలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే పవనే ఆమెను వారించారు. తన తండ్రి ముద్రగడ వద్దకు వచ్చి మాట్లాడతానని చెప్పి పంపేశారు. దీన్ని కూడా అవహేళన చేస్తూ ముద్రగడ తండ్రీ, కూతుళ్ల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ విమర్శలు చేశారు. చివరికి ముద్రగడను అస్సలు నమ్మలేని పరిస్ధితికి కాపులతో పాటు ఆయన కుటుంబం కూడా వచ్చేసింది.

 

చివరికి పవన్ కళ్యాణ్ 70 వేల పైచిలుకు మెజార్టీతో పిఠాపురంలో గెలవడం, జనసైనికులు, కాపులు ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవం అంటూ ట్రోలింగ్ చేస్తుండటం ఆయనకు చిర్రెత్తిస్తున్నాయి. చివరికి ఇవాళ మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తాను ఓడిపోయానని, అన్నట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ కోసం పత్రాలు రెడీ చేసుకున్నట్లు ప్రకటించారు.

 

అంతే కాదు తనను ఉప్మా పద్మనాభం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని, అంటే ఉప్మా అంత చీప్ గా కనిపిస్తోందా అని ముద్రగడ అడిగారు. అలాగే మీరు (పవన్ ఫ్యాన్స్) ఎవరినైతే అభిమానిస్తున్నారో వారితో పలావు పెట్టించాలని ముద్రగడ వారికి సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

 Don't Miss this News !